Tuesday 31 December 2013

నా ఇష్టం..

నా ఇష్టం.. 
బండి చంద్రశేఖర్ 

వాడి మాటలన్నీ 
అబద్దాలని తెలిసినా 
ముఖాన పులుముకున్న
అరువు నవ్వుతో 
ఆలింగనం చేసుకునే 
మనుసుల్ని చూసి... 

వేల కోట్లు
దోపిడీ చేసినా
వేదికల మీద
చప్పట్ల దుప్పట్లు
పరిచే వేలవేల
మనుషుల్ని చూసి..

బందుత్వానికి
ఇరుసుగా నిలవాల్సిన
సహజ మానవ
సంబంధాలను పక్కకునెట్టి
ఈ లోకాన్ని నడిపించే
ఓ బలమైన ఛట్రం చుట్టూ
పరిభ్రమించే పలకరింపుల
పొంగుల్ని చూసి...

నా నుంచి జారిపోయిన
నా మనస్సును చూసి...
నాగరికత నన్ను
చీదరించుకుంటున్నదా..?
ప్రేమకు అర్థం
తెలియని అనాది
మానవున్నని నన్ను
ఆడిపోసుకుంటున్నదా..?

సాటి మనిషిపై
కనికరం లేని
రాతియుగపు
బండ మనిషినని
ఆధునికత నన్ను
తిట్టుకుంటున్నదా..?

నా ముఖం లాగనే
నా మనస్సంతా
కఠిక చీకటని
అనుక్షణం నన్ను
ఈసడించుకుంటున్నదా..?

ఈ నాగరికత
నన్ను తన్ని తగిలేసినా
ఈ ఆధునికత
నన్ను దహించివేసినా ..

అర్థమే అన్నిటికీ
పరమార్థం కాదని
నమ్మిన అనాది
మానవున్నే నేనిష్టపడతా.....